శీర్షిక

రానివారిని పిలవ వేడుక....
రచయిత చిర్రావూరు భాస్కర శర్మ
బొమ్మలు రామకృష్ణ

రానివారిని పిలువ వేడుక బోడితల అంట వేడుక అని సామెత. ఇది సామెతో, నానుడో, పలుకుబడో తెలీదు కాని చాలా విరివిగా మాత్రం వాడేస్తాం.

రావాలి! రావాలి! అని చిటికలేస్తారు, ఉయ్యాలలో బిడ్డను చూసి, ఆ బిడ్డ లేవలేదు, చేతులందిస్తే పట్టుకుని మాత్రం ఎత్తుకోరు, కారణం తెలిసినదే అమ్మో! మేకప్ చెరిగిపోదూ, చీర నలిగిపోదూ. అదనమాట సంగతి. 

మొన్ననో రోజు ఒక మనవరాలు తుఫాన్ మెయిల్లా వచ్చేసి 'తాతా! నా పెళ్ళి, ఫలానా తారీకు, నువ్వు, అమ్మమ్మ తప్పకుండా రావాలి, పదిరోజులముందే, కార్ పంపిస్తాను మరచిపోకు, అమ్మ కూడా మరీ మరీ చెప్పమందీ అని, వచ్చినంత హడావిడిగానూ వెళిపోయింది. ఇల్లాలితో 'చూడవోయ్! దీనికి మనమంటే ఎంతప్రేమోనాంటే 'మీదంతా తింగరి మేళం! కూచుని లేవలేనమ్మ వంగుని తీర్ధం వెళతానందిట, అలాఉంది మీ సంగతి. ఇంట్లోనే రోజు గడవటం కష్టమవుతుంటే, పెళ్ళివారింట్లో పదిరోజులుండగలరా? మీరెలాగా రాలేరని దానికీ తెలుసు. ఊరికే పిలిచిందంతే రానివాళ్ళని, అదే రాలేని వాళ్ళని పిలవడం ఒక వేడుక.'

  అత్తగారు ఆడపడుచుదగ్గరికి అమెరికా వెళ్తున్న సంగతి తెలిసిన కోడలు 'అత్తయ్యా! పండగకి నెలముందు రమ్మని చెప్పేను, ఎప్పుడొస్తున్నారూ అంది ఫోన్ లో. దానికా అత్త గారు 'నీ దగ్గరకే వద్దామనుకుని బయలుదేరేనే, ఐతే నీ ఆడపడుచు, 'అమ్మా ఒక సారి రావే' అని గొడవచేస్తుంటే, నీ బావగారు వీసానా అదేంటో దానికోసం పదిరోజులు తిరిగితే నిన్ననొచ్చిందిట. ఇదిగో టిక్కట్టు బుక్ చేస్తానంటున్నాడు, మళ్ళీ సంవత్సరం పండగ నీదగ్గరేలే అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంది, గడసరి అత్త. పిలిచినట్టూ అయింది రాలేననిపించుకున్నట్టు అయిందికదా!

మా ఊళ్ళో  ఒక కార్యక్రమం ఎవరిని పిలుదామని తర్జన భర్జనపడి చివరికి దేశాధ్యక్షుణ్ణి పిలిచేద్దామని పిలిచేసేరు. వారిని పిలిచేమనీ చెప్పేరు. నిజానికి ఆయనకు ఇటువంటి ఆహ్వానాలెన్ని ఉంటాయో! అన్నిటికి వెళ్ళగలరా? అంతెందుకు ఉద్యోగం లో ఉండగా నాకు అన్నీ అహ్వానాలే పెళ్ళి దగ్గరనుంచి. ఎన్నిటికి వెళ్ళగలం? ఒకచోటి కెళితే మరొకచోటికి పోలేదని నింఫ్దలు వస్తాయి. అందుకు ఎక్కడికి వెళ్ళేవాణ్ణీ కాదు. వారికి పిలిచినట్టూ నేనువెళ్ళనట్టు అయ్యేది. 

రావయ్యా! రా రా అని కొన్ని కోట్లమంది పిలుస్తున్నారు వచ్చేడా? ఎవరికి కనపడ్డాడు? ఎవరికి కనపడలేదు. కాని అందరూ పిలుస్తూనే ఉన్నారు. హిరణ్యకశిపుడు ఎక్కడరా! నీ హరి రమ్మను, అని పిలిచేడు వచ్చేడా? లేదు మరి ప్రహ్లాదుడో

పానీయంబులు ద్రావుచున్ గుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదుల.......... సర్వకాల సర్వాస్థలలో హరి దగ్గరే ఉన్నాడని తలచేడు ఎక్కడో ఉన్నవాడిని రమ్మనలేదు. హిరణ్యకశిపుడు ఎక్కడున్నాడాని అడిగినదానికి 
ఇందుగలడందు లేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే. అన్నాడు పోతన గారి వెదకి చూచిన అన్నారు. ప్రతిచోటా ఉన్నాడయ్యా. నువ్వు వెతుక్కోలేకపోతే పొరపాటు ఆయనది కాదు. నువ్వు పిలిస్తే రాడు. నీకు రాని వారిని పిలవడం వేడుకయింది.  అంతే

ఏంటి అంతే అంటున్నారు ఈ వేళ మీ పుట్టిన రోజు తలంటుతా రండి అంది ఇల్లాలు. ఇదేంటబ్బా జుట్టున్నంత కాలం నా చేతులు పడిపోతున్నాయి మీతల రుద్దలేక, గడ్డిమేటిలా జుట్టూ మీరూనూ అనేది ఇప్పుడేంటనుకుంటే, గుండుమీద వెంట్రులే లేవుగా, అందుకనమాట. ఓ చెంబుడు నీళ్ళు పోసేస్తే పనయిపోతుంది, బోడితల అంటినట్టయిపోదూ! అదనమాట వేడుక. మొన్ననో సారి మా సత్తిబాబుతో మాటల్లో అన్నా బోడిగుండుకీ బట్టతలకి తేడా ఏంటని దానికి బోడిగుండు అంటే నెత్తిమీద మీద కొన్ని పరకలున్నవి మంగలితీసేస్తే మిగిలినది, బట్టతల భగవంతుడు చేసినది. అదీగాక బలమున్న నేలలో మొక్క లేస్తుంది, చవిటినేలలో లేవదుకదా! చవిటిగుండు లేదా బట్టతలంటే లోపలి గుంజు అయిపోతే నెత్తి మీదవి రాలిపోయాయనమాట అన్నాడు. నిజమేనా?

*****

1 comment:

  1. ఈ కధ ఎన్ని రకాలుగా చూసిన అక్షర సత్యమే . బతకని బిడ్డ బారెడు అన్నట్లే .

    ReplyDelete