శీర్షిక

నాకు నచ్చిన కథ-పెళ్ళానికి ప్రేమలేఖ - రంగనాయకమ్మగారు
రచన - టీవీయస్.శాస్త్రి
ప్రేమలేఖలు వ్రాయటం అందరికీ చేత కాదు. మీరు ఎప్పుడైనా ఎవరికైనా ప్రేమలేఖ వ్రాసారా? గుర్తుకు  తెచ్చుకోండి.మనలో బహుశ: నూటికి 80 మంది వ్రాసి ఉండరు.ఒక పదిమంది వ్రాసి ఉంటారేమో! మిగిలిన పదిమందీ వ్రాసినవి ఒక విధంగ వారి 'మగ'తనాన్ని చూపించేవే!  నిజంగా మనం వ్రాసిన దాంట్లో మాత్రం ప్రేమ ఉన్నా,అందుకున్న వారి మనసులో చిరకాలం అది ఒక అపురూప చిత్రమై నిలిచిపోతుంది. 'మన వాళ్ళు వట్టి వెధవాయలోయ్!' అన్న  మహారాజశ్రీ గిరీశం గారు కొన్ని అక్షరసత్యాలు చెప్పుతుంటాడు ఒక్కొక్కసారి.! 'ప్రేమలేఖలు' అనే అద్భుతమైన  పుస్తకాన్ని వ్రాసిన శ్రీ చలం గారు,తెలుగువాళ్ళలో చాలామందికి  ప్రేమలేఖలు వ్రాయటం చేత కాదన్నారు.ప్రియురాలికి ప్రేమలేఖ వ్రాస్తే,అది పెళ్లి కాకముందే వ్రాయాలి. కాకపోతే--మరీ పెద్ద అయిన తరువాత,కొన్ని ప్రత్యేక పరిస్థితులలో,భార్యాభర్తలు చెరొకచోట ఉన్నప్పుడు, నిజమైన 'ప్రేమలేఖలు' కొన్నిటిని  మనం గమనించవచ్చు.ఆత్మీయ ,ఆప్యాయతానురాగాలు తెలుపుకుంటూ, ప్రేమను పంచుకుంటూ, పెంచుకుంటూ  ప్రేమలేఖలు వ్రాసే ప్రేమికులు ఎంత మంది ఉంటారు?నేను చెప్పే విషయాలన్నీ స్త్రీలకూ కూడా వర్తిస్తాయి.పెళ్ళికి ముందు గానీ, పెళ్ళైన కొత్తల్లో గానీ, ఒకవేళ కొన్ని రోజులు భార్యాభర్తలు ఒకరికొకరు దూరంగా ఉండవలసి వస్తే.ఒకవేళ వారు ప్రేమమలేఖలు(?) వ్రాసుకుంటే,వాటిలో మహా ఉంటే,సెక్స్ ను ఉద్రేకపరిచే విషయాలే ఉంటాయి.ఉదాహరణకు--'నీకు నా ముద్దులు!' అనో, మరేమేమేమో ఉంటాయి. భూతద్దం వేసి వెతికినా వాటిల్లో 'ప్రేమ'  అనేది కనపడదు. ఇక ప్రస్తుత ఆధునిక ప్రపంచం గురించి చెప్పేదేముంది ? ప్రేమించటం,ప్రేమించబడటం -- రెండూ తెలియని రోజులు ఇవి. పార్కులంబడిపడి తిరగటమే 'ప్రేమ' అని అనుకుంటున్నది నేటి యువత! నాకు తెలిసినంత వరకూ, ప్రేమ అనేది ఒక అవ్యక్తమైన మధురానుభూతి! ప్రేమించబడే వ్యక్తికి,ప్రేమ అనేది మన స్పందన వల్లే తెలియాలి! ప్రత్యేకమైన వ్యక్తీకరణ అవసరము లేనిదే నిజమైన ప్రేమ!అంతే కానీ,వికారపు వెకిలి చేష్టలను, ప్రేమ అనలేము.ఇదంతా చెపుతుంటే,నాకు, విషయాలలో విపరీతమైన అనుభవం ఉందని మీరందరూ అనుకోవచ్చు. నిజంగా నేను,'ప్రేమికుడనే'! ప్రేమించటం ఇప్పుడు కూడా నేను నేర్చుకుంటున్నాను! భార్యాభర్తలు యవ్వనంలో ఉన్నప్పుడు  ఒకరినుంచి  మరొకరు ఏదో ఒకటి ఆశిస్తారు. వయసొచ్చిన కొంత కాలానికి ,ఒకరికొకరు ఏమీ ఇచ్చుకోలేకపోయామని బాధపడుతుంటారు.వృద్ధాప్యంలో,తన కళ్ళముందరే తన భార్య  పోతే బాగుంటుందని భర్త,---అలాగే,తన కళ్ళముందరే తన భర్త  పోతే బాగుంటుందని భార్య, ఆలోచిస్తుంటారు.అదే 'దివ్యప్రేమ'! అటువంటి 'దివ్యప్రేమ' అనే మధుర కావ్యానికి సమగ్ర రంగుల పద చిత్రమే,శ్రీ రమణ గారు వ్రాసిన 'మిథునం'! కథలోని 'దివ్యప్రేమ' గుర్తుకొచ్చినప్పుడల్లా,మన కళ్ళు మనకు తెలియకుండానే చెమ్మగిల్లుతాయి. ఇక,రంగనాయకమ్మ గారి విషయానికి వస్తే, ఈమ పూర్తి స్త్రీవాద రచయిత్రి అని చెప్పవచ్చు.తరువాత రోజుల్లో  Radical views తో రచనలు చేసారు. వీరు వ్రాసిన కృష్ణవేణి, స్వీట్ హోం,బలిపీఠం లాంటి నవలలు నేటికి చదివినా వాటిలోని  విషయాలు నాటికి కూడా వర్తించేటట్లు ఉంటాయి.ఆధునిక మహిళ,పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నప్పటికీ, 'మహిళ ' పరిస్థితిలో గణనీయమైన మార్పూలేదు! భార్యల వ్యక్తిత్వాన్ని గౌరవించే భర్తలు అరుదుగానే కనిపిస్తారు.ఇదే విషయాన్ని,రంగనాయకమ్మ గారు తన 'పెళ్ళానికి ప్రేమ లేఖ' అనే కథలో,ఎవరినీ నొప్పించకుండా,ఆవిడ బాణీలో చెబుతారు.ఇక కథలోకి వెళ్లుదాం.


*************************



బుచ్చిబాబు,విమలలు ఒక సాధారణ మధ్య తరగతికి చెందిన దంపతులు.వారిది అన్యోన్య దాంపత్యమనే చెప్పవచ్చు.బుచ్చిబాబుకు,పెళ్ళామంటే అపరిమితమైన  ప్రేమ.ఎంతైనా,భర్త కదా--కొద్దిగా పురుషాధిక్యపు అహంకారం ఉంది!కానీ,అతడి భార్య విమలకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉంది. తల్లితండ్రులూ,బంధువుల మీద మనసుమళ్ళి విమల ఒకసారి పుట్టింటికి వెళ్ళింది, భర్త అనుమతితోనే! కొద్ది రోజుల్లోనే తిరిగి వస్తానని చెప్పింది. ఎన్నిరోజులైనా  ఆవిడ మాత్రం పుట్టింటి నుండి తిరిగి రావటం లేదు.ఇక,గత్యంతరము లేక పెళ్ళానికి  (ప్రేమ?)లేఖల  రాయబారం సాగించాడు. లేఖల సారాంశం క్లుప్తంగా చెప్పాలంటే  --తనకు హోటల్ భోజనం పడటంలేదని, రోజూ ఎక్కడనుంచో  వచ్చి ఒక దొంగపిల్లి పాలు త్రాగిపోతుందని ......! విమల, లేఖలన్నిటినీ చదివి,భర్త  మీద జాలికలిగి పుట్టింటి నుండి తిరుగు ప్రయాణానికి సిద్ధమైంది.అకస్మాత్తుగా వెళ్లి భర్తను ఆశ్చర్య పరచాలనేమో! తాను వస్తున్న విషయం గురించి భర్తకు లేఖ వ్రాయలేదు. బుచ్చిబాబుకు విసుగుపుట్టి, ఆఖరి అస్త్రంగా ఒక లేఖను వ్రాసాడు.ఈసారి లేఖలో బుచ్చిబాబు కొంత అతితెలివి ప్రయోగించాడు.పక్కింటి ఆవిడ అందాన్ని గురించి,ఆవిడ మంచితనం గురించి, ఆవిడను  ఆకాశానికి  ఎత్తేస్తూ వ్రాసాడు.దీని వల్ల అతని భార్యకు అసూయ(jealousy) కలుగుతుందని అతని 'మగ'(భర్త ) ఆలోచన.అది కాస్తా బెడిసికొట్టింది. విమల రాలేదు సరికదా,బదులుగా ఒక ఘాటైన లేఖ కూడా వ్రాసింది.మొదటిసారిగా,చివరిసారిగా ఒక నిజం తెలుసుకుంది.అది ఏమిటంటే--తన భర్త పెళ్ళానికి ప్రేమలేఖ వ్రాయటం చేతకాని చవట అని.అంతేకాదు,అటువంటి చవటతో కాపురం చేయటంకన్నా హీనమైనపని మరొకటిలేదనే భావనకు పూర్తిగా వచ్చింది. బుచ్చిబాబుకి ఏమీ పాలు పోవటంలేదు.భార్యను తిరిగి రప్పించుకోవటంలో అతను చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి.అప్పుడు బుచ్చిబాబుకు జ్ఞానోదయమైంది.భార్యాభర్తల సంబంధం అంటే ఏమిటో అర్ధమయింది.భార్యాభర్తల మధ్య ఉండవలసినవి--ఆర్ధిక అవసరాలు కాదు,శారీరక సంబంధాలు కానే కాదు,భార్య అంటే పనిచేసే పనిమనిషి కాదు,పడక సుఖం ఇచ్చే యంత్రం కూడా కాదని తెలుసుకున్నాడు.ఆఖరి ప్రయత్నంగా మరో నిజమైన  ప్రేమలేఖ వ్రాసాడు. "నాలోని ఒక్కొక్క అణువూ,ఒక్కొక్క హృదయమై నిన్ను ప్రేమిస్తుంది.నీ మనోమందిరం ముందు నిలబడి ప్రతిదినము, ప్రతి యుగము ప్రార్ధిస్తాను." అని వ్రాసాడు. ప్రణయలేఖను చదివి  విమల వెంటనే రివ్వుమని వచ్చి బుచ్చిబాబు కౌగిలిలో కరిగిపోతుంది.
(
కథ పూర్తి అయింది.) 



****************************



తరం వారికి ఇలాంటి ప్రేమలేఖల అవసరం అక్కరలేకపోవచ్చు.మాయాజాలం లాంటి అంతర్జాల యుగంలో ఇటువంటి  లేఖలలోని మాధుర్యం  తెలుసుకునే అవకాశం చాలా వరకు,యువత కోల్పోయారు. ..'ప్రేమలేఖల' కోసం  పోస్ట్ మాన్ కోసం ఎదురు చూడటం, వాటిని ఎవ్వరూ చూడకుండా దాచిపెట్టి పదేపదే చదవటం, చదివిన ప్రతిసారీ మనసు ఆనంద డోలికల్లో ఊగటం....ఇటువంటివన్నీ చెప్పలేని మధురానుభూతులు! పెళ్ళానికి  ప్రేమలేఖలు ఎలా వ్రాయాలో చెప్పటమే కాకుండా,భార్యాభర్తల మధ్య  ప్రేమానుబంధం ఎలా ఉండాలో కూడా తరం వారికి చెబుతుంది కథ. స్త్రీ హృదయాన్ని గురించి ఆలోచింపచేసే  గొప్పతనం కూడా కథలో ఉంది. అందుకే, కథ అంటే నాకు ఇష్టం.

స్త్రీవాద రచయిత్రి రంగనాయకమ్మగారికి కృతజ్ఞతలతో...
(చలం గారు ఒక ప్రేమలేఖలో ప్రేయసికి ఇలా వ్రాస్తాడు,"నీ వైపు ప్రయాణం చేస్తున్న రైలు అయినా-నాకు ఆత్మీయంగానే  కనిపిస్తుంది- నీకు చేరువవుతుంది కనుక"అని.)


*****

ఈ సంచికలోని ఇతర రచనలు 




21 comments:

  1. చక్కని కథను ఆసక్తికరంగా చెప్పినందుకు శ్రీ శాస్త్రి గారికి అభినందనలు!

    విజయలక్ష్మి

    ReplyDelete
  2. మంచి సందేశంతో కూడిన కథను తన అద్భుతమైన వ్యాఖ్యానంతో పాఠకులను ఆకట్టుకునే విధంగా ​​క్లుప్తంగా ,చక్కని శైలిలో చెప్పిన శాస్త్రి గారు అభినందనీయులు!

    ధనలక్ష్మి

    ReplyDelete
  3. నిజం గానే శాస్త్రి గారు చక్కగా వ్రాసారు:

    రేడియో నాటికలలో, "నాటికి నేడు " చిన్న 30 నిమిశాలాల్ నిడివి గలది: రైలులో ఇద్దరు తటస్టపడి, ముదివయస్సులో, ఇరువుకి వివాహమై మానములు మనమరంద్రతో వున్నా స్తితిలో, తమ దశాబ్దాల కరటం నాటి జ్ఞాపకాలు తెచ్చుకుమ్టు, చాల తమాషాగా వారి సంభాషణలు సాగుతాయి: చాలా మధురంగా వుంటుంది:
    నిజంగానే నీటి "అంతర్జాలం" తో కొన్ని ముక్యమైన వి యువత చాల కోల్పొతున్నరు.. :

    "ప్రేమ లేఖలు " గాని "ఔ ను వాళ్ళి ద్దరు ఇష్టపడ్డారు" సినిమాల లో ప్రేమికులు ఇరువురు తమని తాము చూసుకూకుండానే అమితం ప్రెమిమ్పపదతారు. మీ వ్యాసం చివరిలో "శ్రీ చలం గారు చెప్పినట్లు ఎ రైలుఇన..... "

    బాలు

    ReplyDelete
  4. "నీవైపు ప్రయాణిస్తున యేరైలు అయినా నాకు ఆత్మీయంగానే కనిపిస్తుంది నీకు చేరువవుతుంది కనుక" అద్భుతం అండీ ఈలైన్స్....మరియు ఆర్టికల్

    ReplyDelete
  5. సృజన లో మీకు నచ్చిన కధ 'పెళ్ళానికి ప్రేమలేఖ ' గురుంచి చాల చక్కగా చెప్పరు. ఆఖరున చలంగారి మాటలతో తో ముగించడం ఇంకా బావుంది .
    mani vadlamani

    ReplyDelete
  6. పెళ్ళానికి ప్రేమలేఖ బాగుంది

    ReplyDelete
  7. రంగనాయకమ్మ గారి ఈ కథ వాస్తవికతకు చాలా దగ్గరగా ఉంది. కానీ నేటి సమాజం కృత్రిమ విషయాలకు ఇచ్చినంత ప్రాధాన్యం వాస్తవికతకు ఇవ్వడం లేదు.
    మీ వివరణ చాలా చాలా బాగుంది.
    ధన్యవాదాలు
    --- కె ఎస్ చారి

    ReplyDelete
  8. చాలా చక్కటి హృద్యమైన కథ గురించి మీరు మనోహరంగా చెప్పారు ..
    అల్లాంటి కథలు అరుదు. ధన్యవాదాలు

    శ్రీదేవి మురళీధర్

    ReplyDelete
  9. Replies
    1. పెళ్ళానికి కొద్ది రోజుల విరహంతో ప్రేమలేఖ వ్రాయటం బట్టే అతనికి ప్రేమ ఎంత గాఢంగా వుందో తెలుస్తున్నది. భార్యకి అంత కంటే ఏమి కావాలి. కధ చాల బాగుంది.ఎంతమంది ప్రేమలేఖలు వ్రాస్తారో శ్రమపడి డేటా పరిశొధించి పది శాతమే అని తేల్చగల్గారు. చాలా సంతోషం.

      Delete
    2. అతనికి పెళ్ళాం మీద ప్రేమ లేదని నేను ఎక్కడా చెప్పలేదు,కథలోను చెప్పలేదు. అతనికి పెళ్ళానికి ప్రేమలేఖ వ్రాయటం చేతకాదని చెప్పటం మాత్రమే జరిగింది.​ఇక నేను ఏ డేటా సేకరించ లేదు ,అది నా ఊహ మాత్రమే!విరహంలో వ్రాసిననంత మాత్రాన ​
      ​ఆ లేఖల్లో ప్రేమ ​ఉంటుందని నేను అనుకోను!ఏది ఏమైనా మీ స్పందనకు కృతజ్ఞతలు నాగేశ్వరరావు గారు !​
      టీవీయస్.శాస్త్రి

      Delete
  10. pellaniki pramalekha chala bagundi elanti kadhalu arudhu thanks sastry garu


    ReplyDelete
  11. శ్రీ శాస్త్రిగారు - రంగనాయకమ్మగారి కధను - తనదయినశైలిలో ఆసక్తికరంగా చెప్పిన విధానం బహుబాగుంది. కధాంశానికి వచ్చేముందు - ప్రేమలేఖలు సాధారణంగా ఎలాఉంటాయో (నేతి-బీరకాయలో నేయి ఉండే (?) చందాన) - విశదపరుస్తూ సాగిన 'ఉపోద్ఘాతం' నిజ-జీవితంలో, అందునా ఈరోజుల్లో, ఉంటున్న పరిస్థితులకు అద్దంపట్టేలా ఉంది. ఒక ప్రముఖ రచయిత్రి రాసిన కధ తనకు ఎందుకు నచ్చిందో సకారణంగా వివిరించిన తీరు - శ్రీ శాస్త్రిగారి రచనా-విలక్షణానికి ఓ ఉదాహరణగా చెప్పవచ్చు.

    -మొహమ్మద్ అబ్దుల్ వహాబ్.

    ReplyDelete
  12. శ్రీయుత శాస్ర్తి గారూ... ప్రీమలేఖ ఆను ప్రక్రియ రచనా విన్యాసము ను వివరింప. ప్రయత్నించుటకై శ్రీమతి రంగనాయకమ్మ గారి రచనను పరిచయము చేసితిరో లేక ప్రేమ లేఖ రచనా ప్రత్యేకతను, హృదయపు పుటలందు అవి చేయు సంతకములను గూర్చి వివరింపబూని , శ్రీమతి రంగనాయకమ్మ గారి కథను పరిచయము చేసితిరో తెలియదు గానీ , మీ ప్రయత్నము మిక్కిలి ప్రశంసనీయము. సుదీర్ఘకాలమనంతరము రంగనాయకమ్మ గారి రచనను గుర్చి ఆలోచించడము ముదావహము. ఆనాటి ఎందరో ప్రేమలేఖా రచయిత, రచయిత్రు ల మదిలో గిలిగింతలు కలుగజేయు మీ రచన ప్రేమికుల మనోదర్పణ్అమ్ము కాబోలు........ధన్యవాదములు

    ReplyDelete
  13. మీ రచనా విధానము బహుధా ప్రశంసనీయము

    ReplyDelete
  14. మమ్ములను శాస్త్రి గారు ఎక్కడికో తీసుకోని వెళ్లారు. చక్కగాను,మెచ్చుకొదగ్గనిగా వుంది. ధన్యవాదములు శాస్త్రి గారు.

    ReplyDelete
  15. బాగుంది శాస్త్రి గారు

    ReplyDelete